ఏపీలో లక్షలాది కుటుంబాల జీవన శైలిని అమాంతం మార్చేసే బృహత్తరమైన ప్రాజెక్టు -పోలవరం ప్రాజెక్టు. పేదరికాన్ని తరిమేసి మినిమం బతుకును ప్రసాదించే వరప్రదాయని ఇది. నదుల్లోని నీటిని సముద్రంలోకి వృథా పోకుండా సద్వినియోగం చేసే అసాధారణ ప్రాజెక్టు ఇది. లక్షలాది ఎకరాల్లో మూడు పంటలు పండించి రాష్ర్టాన్ని, దేశాన్ని సస్యశ్యామలం చేసే హిస్టారికల్ ప్రాజెక్టు ఇది. అయితే ఈ ప్రాజెక్టును ముందుకెళ్లకుండా తుంగలో తొక్కేస్తున్నారు. ఇందుకు కేంద్రం ఓ కారణమైతే, లోకల్ నేతలు మరో కారణం.
భారీ ప్రణాళికతో నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టుకు జాతీయ స్థాయి గుర్తింపు ఉన్నా… ఈ ప్రాజెక్టును తుంగలో తొక్కేసేందుకు ఎవరికి వారు కుట్రలు చేస్తున్నారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం ఓ కారణం అన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలవరం విషయంలో కేంద్రం అరకొర నిధుల్నే విధిలిస్తున్నా చంద్రబాబు ఏ మాటా మంతీ లేకుండా ఎదురు చూస్తున్నారు. పర్యావరణం, చట్టాలు, నియమాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని సరిపెట్టుకుంటున్నారు. అయితే ఇదే అలుసుగా కేంద్రం సైతం ఓ ఆటాడుకుంటోంది. పోలవరం సమస్యను ఎటూ తేలకుండా పాతాళంలోకి తొక్కేస్తోంది.
తాజాగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటన చూశాక ఏపీ నేతల చెవులు మొద్దుబారిపోయాయనే అనుకోవాలి. సరిహద్దు రాష్ర్టాలు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లతో వివాదాలు ముగిస్తేనే ఈ ప్రాజెక్టు ముందుకెళుతుందంటూ ఆయన చేసిన ప్రకటనను మనవాళ్లు విని గాలికి వదిలేశారు. `పోలవరం జలాశయాన్ని నింపితే అయిపోతారు` అంటూ హుకుం జారీ చేశారాయన. లోక్‌సభ సాక్షిగా సూటిగా ఏపీ ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చారు. తేదేపా నేత కింజరపు రామ్మోహన్ నాయుడు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా పోలవరంపై విరుచుకుపడ్డారు సదరు మంత్రి. పోలవరం నిర్మాణంపై ఆంక్షల్ని కేంద్రం ఎత్తేయాలంటూ ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే ఏడాది పాటు నిర్మాణం వరకే గతేడాది జూన్‌లో ప్రతిపాదించామని జవదేకర్ వివరణ ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే ఈ పర్యావరణ మంత్రి కావాలనే పోలవరంని తుంగలో తొక్కేస్తున్నాడా? అనిపించక మానదు. కొన్ని లక్షల కుటుంబాల్లో నిప్పులు పోస్తున్నారాయన. ముఖ్యంగా ఎప్పటికీ ఎదగని ఉత్తరాంధ్రని నిలువునా ముంచేసే ప్రకటన ఇది. ఇంత జరుగుతున్నా ఏపీ నేతలు వినోదం చూస్తున్నట్టే ఉంది.
The post `పోలవరం`ని కావాలనే తొక్కేస్తున్నారు! appeared first on MaaStars.