శిల్పకళావేదికలో మంగళవారం రాత్రి శంకరాభరణం-2017 అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. శంకరాభరణంలో బాలనటిగా నటించిన తులసి తన గురువు కె. విశ్వనాథ్ గౌరవార్థం ఈ అవార్డుల ప్రదానోత్సవం చేపట్టారు. కార్యక్రమానికి కె. విశ్వనాథ్, ప్రముఖ నిర్మాత, రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి హాజరయ్యారు. వీరు పలు విభాగాల్లో కళాకారులకు అవార్డులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. భరతజాతి, తెలుగు జాతి గర్వించే గొప్ప దర్శకుడు, కళా తపస్వి విశ్వనాథ్ అని కొనియాడారు. కళలన్నా, కళాకారులన్నా తనకు ఎంతో గౌరవమని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో యువ గాయకులు శ్రీకృష్ణ, రఘురాం, సాకేత్, గీతామాధురి, రమ్య, పరిణికలు ఆలపించిన శంకరాభరణం, సిరివెన్నెల, సాగర సంగమం గీతాలు ఆద్యంతం అలరించాయి. అంధ కళాకారులు చక్కటి హావభావాలతో ప్రదర్శించిన కూచిపూడి, శాస్త్రీయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తమ తమిళ నూతన దర్శకుడుగా ధనుష్ నిలిచారు. ఈ అవార్డును ధనుష్ తండ్రి కస్తూరి రాజా విశ్వనాథ్, సుబ్బిరామిరెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఉత్తమ నూతన నటుడు ఆకాష్‌పూరీకి కూడా విశ్వనాథ్ అవార్డును అందజేశారు. వీరితో పాటు తులసి, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, ఏడిద శ్రీరాం, ఏడిద రాజా, జీవిత రాజశేఖర్ తదితరులు ఈ అవార్డులను అందజేశారు.
The post ఘనంగా శంకరాభరణం అవార్డుల ప్రదానం appeared first on MaaStars.