దాదాపు 20వేల మంది సినీకార్మికులు నివశిస్తున్న చిత్రపురి కాలనీపై మాజీ ఐపీఎస్ అంజన్ సిన్హా దందా సాగిస్తున్న సంగతి తెలిసిందే. సినీకార్మికులు వెళ్లే రోడ్డుకడ్డంగా ఓ భారీ గోడను నిర్మించారు మ్యాడమ్. దీనివల్ల నిత్యం వేలాదిమంది ఉద్యోగులు, నిరంతరం ఆ దారి గుండా వెళ్లే మహిళలు, స్కూలు పిల్లలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. స్కూలుకు వెళ్లే బాలలంతా శ్మశాన మార్గంలో నడిచి వెళ్లాల్సిన ధైన్యం ఉందక్కడ. కాలనీకి మరోవైపు పంచాయితీ రాజ్ రోడ్ మార్గం గుంతల మయం కావడంతో అటు వెళ్లలేక తప్పనిసరై దళితుల శ్మశాన మార్గం గుండా ఉన్న రోడ్‌నే చిత్రపురి వాసులు ఆశ్రయించి వెళ్లాల్సొస్తోంది. అయితే కొద్దిరోజుల క్రితం అదే మార్గానికి సమీపంలో ఉన్న టింబర్‌లేక్ కాలనీ లో ఉంటున్న మాజీ ఐపీఎస్ అంజన్ సిన్హా సహా పలువురు కాలనీ వాసులు ఆ రోడ్డుకు అడ్డంగా గోడ కట్టించేశారు. దాంతో నాటి నుంచి వేలాది సీనీకార్మికులకు తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కోవాల్సొస్తోంది. ప్రస్తుతం ఈ అడ్డుగోడ విషయమై కోర్టు గొడవ నడుస్తోంది. టింబర్‌లేక్ కాలనీలో నివశిస్తున్న పది మంది బడా బాబుల (ఐఏఎస్, ఐపీఎస్‌లు సహా పలువురు అధికారుల నివాసాలున్నాయి) కోసం వేలాది మంది సినీకార్మికులకు రోడ్డు లేకుండా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పలు మార్లు మంత్రులు వచ్చి ఆజ్ఞాపించి వెళ్లారు తప్ప ఆ గోడను కూలగొట్టడం సాక్షాత్తూ మంత్రుల వల్లనే కాలేదని కాలనీ వాసులు చెబుతున్నారు. తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, రోడ్లు, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఈ రోడ్డు విషయమై పరిష్కారం చూపించేందుకు ముందుకొచ్చారు. వెంటనే అడ్డుగోడను పడగొట్టాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు. వారంలోగా సమస్యకు పరిష్కారం చూపాల్సిందిగా ఎండీవో, రెవెన్యూ శాఖ అధికారుల్ని ఆదేశించారు. ఈరోజు చిత్రపురి కాలనీకి విచ్చేసిన సదరు మంత్రులు కాలనీ వాసుల సమస్యల పరిష్కారానికి పలు హామీలిచ్చారు. అందరికీ ఆధార్, అందరికీ రేషన్, ఉచిత వైఫై ఏర్పాటు, ఆసుపత్రి ఏర్పాటు, ప్రభుత్వ స్కూల్ నిర్మాణం.. తదితరాల్ని సాధ్యమైనంత తొందరగానే ఏర్పాటు చేస్తామని అన్నారు. తక్షణ సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా అధికారుల్ని సదరు మంత్రులు ఆదేశించారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ -“చిత్రపురి కాలనీలో చాలా సమస్యలున్నాయి. ముఖ్యంగా టింబర్ లేక్ రోడ్‌కి వెళ్లే మార్గంలో అడ్డుగోడను తొలగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోడ్ సమస్య కోర్టు గొడవల్లో ఉందని చెప్పారు. టింబర్‌లేక్ కాలనీలోని కొందరు అధికారులకు ఇందులో ప్రమేయం ఉందని తెలిసింది. అయినా ఈ రోడ్ ఆగదు. ప్రజల పక్షాన మేం నిలుస్తాం. రోడ్స్, రవాణా శాఖ మంత్రి మహేందర్ సమక్షంలో ఈ రోడ్ నిర్మాణం పూర్తవుతుంది. అన్ని అడ్డుగోడలు కూలగొట్టిస్తాం. అదేకాదు ఎంత ఖర్చయినా పంచాయత్ రాజ్ శాఖ రోడ్ కూడా చిత్రపురికి నిర్మిస్తాం. గుంతల రోడ్ వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యక్షంగా చూశాం. ఇప్పుడు ఆ రోడ్ సమస్యను పరిష్కరిస్తాం“ అని చెప్పారు. ఇతరత్రా సమస్యల గురించి మాట్లాడుతూ -“రేషన్ షాప్ మంజూరు , వైఫై ఏర్పాటు చేస్తామని గతంలోనే చెప్పాం. ఇక్కడ ఉచిత వైఫై ఏర్పాటుకు గతంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి కేటీఆర్ హామీ ఇచ్చారు. కేటీఆర్, మహేందర్ నేతృత్వంలో అది కూడా పూర్తవుతుంది. ఈ విషయంపై మేమంతా మాట్లాడుతాం. ఇప్పటికే ఆర్టీసీ బస్ వస్తోంది. రోడ్ల నిర్మాణం పూర్తయితే కాలనీలోనికే బస్ వస్తుంది. అలాగే ఓ ప్రభుత్వ పాఠశాలను ఇక్కడ ఏర్పాటు చేయనున్నాం. కరెంటు, నీరు ఇతరత్రా సమస్యల్ని పరిష్కరిస్తాం“ అని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న ఆర్డీవోని
ఆదేశిస్తూ చిత్రపురికి అడ్డుగా నిర్మించిన ఆ గోడను కూల్చేయాల్సిందిగా ఆదేశించారు. వెంటనే ఆ పని చేయాల్సిందిగా మంత్రి ఆదేశించారు. ఆ రోడ్ ప్రయివేటు రోడ్ కాదు.. ప్రజలందరిదీ.. ప్రభుత్వానికి చెందినది. అడ్డుగోడలు కట్టకూడదని మంత్రివర్యులు అన్నారు. 4,5 రోజుల్లోనే టింబర్ లేక్ రోడ్ సమస్యను మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పరిష్కరించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పంచాయితీ రోడ్ విషయమై మంత్రి మహేందర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. రెవెన్యూ అధికారులు కాలనీకి విచ్చేసి ఓరోజు రేషన్ కార్డుల్ని జారీ చేసే పని పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని అన్నారు.
చిత్రపరిశ్రమకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తుంది. 24 శాఖల ట్రేడ్ యూనియన్స్ అందరికీ ఇల్లు కట్టించే పూచీ మాది. ఆ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. అలాగే కార్మిక నేతలు సెక్రటేరియట్ వరకూ వచ్చేంత స్వేచ్ఛను మేం కల్పించామని తలసాని అన్నారు. అన్నేళ్లు పాలించిన కాంగ్రెస్సోళ్లు .. చేయలేనివి మేం వచ్చిన వెంటనే పూర్తి చేశామని సినిమాటోగ్రఫీ మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం చిత్రపురి కాలనీలో హరితహారం కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. మొక్కల్ని పాతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
ఈ కార్యక్రమంలో రోడ్లు, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు కొమర వెంకటేష్, కమిటీ సభ్యులు పరుచూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి కృష్ణ మోహన్, మహానందిరెడ్డి, కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మండల అధికారులు, రెవెన్యూ, ఎంపీడీవో అధికారులు, స్థానిక కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.
The post చిత్రపురి అడ్డుగోడను వెంటనే కూలదోయండి: మంత్రి తలసాని appeared first on MaaStars.