‘బ్రహ్మోత్సవం’లో మహేశ్ బాబుతో ప్రేమకు కటీఫ్ చెప్పే టైములో ‘మీ ఇంట్లో అందరినీ పలకరించే సరికి అలసట వస్తుంది’ అని కాజల్ ఓ డైలాగ్ చెప్తుంది. అంటే.. మహేశ్ కుటుంబంలో అంత ఎక్కువమంది ఉన్నారని.. లెంగ్తీ ఫ్యామిలీ భరించడం నావల్ల కాదని కాజల్ ఉద్దేశ్యం. సోమవారం సాయంత్రం బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు నటించిన ‘కొబ్బరిమట్ట’ టీజర్ రిలీజయింది. ఇందులో ఆడవాళ్ల గొప్పతనం వివరిస్తూ సంపూ ఓ డైలాగ్ చెప్పాడు. అది వినడం కూడా కష్టమే. అలసట రావడం గ్యారెంటీ. టీజర్ అంటే టీజర్ కాదండీ బాబు.. 157 సెకన్లు ఉంది. చాలా సినిమాల ట్రైలర్ కంటే పెద్దదే. ఇది రిలీజ్ చేసిన సాయి ధరమ్ తేజ్ కూడా ప్రపంచంలో అతి పెద్ద టీజర్ విడుదల చేసినందుకు ఆనందంగా ఉంది అన్నాడంటే అర్థం చేసుకోండి. ఆ డైలాగ్ చదివి మీరూ తరించాలనుకుంటే.. కింద ఓ లుక్కేయండి.
“రేయ్.. కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసి ఉంచాలా? ఊడ్చాలా? అని అలోచిస్తుంటే.. పుడతామో! చస్తామో! తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి, పెరిగేసి.. ఎదిగేస్తున్న టైములో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఎదవ కోసం అన్న విషయం తెలిసాకా.. అమ్మానాన్న కలసి పావుకిలో లడ్డూలు, అరకిలో చేగోడీలు పెట్టి దున్నపోతు లాంటి ఓ పెళ్లికొడుకుని తీసుకొచ్చి.. తలదించుకుని పెళ్లిలో, కళ్ళు దించుకుని శోభనం గదిలో పడుకుంటే.. గుండెల మీద తాళి బరువు, శరీరం మీద వాడి బరువూ మోసీ మోసీ.. వాడు వేసిన విత్తనాన్ని తొమ్మిది నెలలు మోసీ మోసీ.. ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజూ కోడి కంటే ముందే నిద్రలేచి నుదిటిన బొట్టు పెట్టి.. వాకిట్లో ముగ్గు పెట్టి.. స్టవ్ మీద గిన్నె పెట్టి.. అందులో పాలు మరగబెట్టి.. కాఫీ పొడి, టీపొడి కలిపిపెట్టి.. పిల్లల నోటికి తిండి పెట్టి.. వాళ్లను బడికి వెళ్ళగొట్టి.. నిన్ను ఆఫీసుకి తరిమికొట్టి.. ఓ చేత రిమోటు, మరో చేత కత్తిపీట పట్టుకుని ఛానల్స్ మార్చి మార్చి.. కూరగాయలు తరిగీ తరిగీ.. పదకొండు గంటలకు మావూరి వంట.. పన్నెండు గంటలకు స్టార్ మహిళ చూస్తూ.. వీటి మధ్యలో వంట చేస్తూ.. కూర ఎక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్లో.. బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి.. ముద్ద మందారం, ఆడదే ఆధారం, మనసు మమత, గోకులంలో సీత, స్వాతి చినుకులు అంటూ పగలూ రాత్రి తేడా లేకుండా.. సీరియల్లో సమస్యలను తన సమస్యలుగా భావించి.. బరువెక్కిన గుండెతో అలిసోచ్సిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి.. అప్పుడు తిని పడుకుంటుందిరా.. ఆదిరా ఆడదంటే!! అలాంటి నీ భార్యను వదిలేస్తానంటావా? బ్లడీ ఫూల్” – ఇదండీ సంపూర్నేష్ బాబు చెప్పిన డైలాగ్. ఇది చదవడానికి అలసట వస్తే.. వినడానికి ఎలా ఉంటుందో ఆలోచించండి?
The post మట్టలోదీ డైలాగ్.. అలసట గ్యారంటీ! appeared first on MaaStars.